-->
కాలంతో కలిసిపోని, పుస్తకాలలొ మగ్గిపోని,కొందరికి మాత్రమే పరిమితంకాని,భావకవిత్వపు సొగసుజూప జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.

ముందుమాట

Read More ->>
 అనగనగా .....
నేను  ప్రస్తుతం పనిచేస్తున్న చోట, ఇదివరలో  మిలటరీ వ్యక్తి  ఒకాయన ఉండేవాడు.
ఆయన ఎప్పుడూ తన నీలిరంగు మోటారు సైకిలుపై హుందాగా అటూ ఇటూ తిరుగుతూ , ఎప్పుడైనా,  ఎక్కడైనా , ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడల్లా నవ్వుతూ  పలకరిస్తూ ఉండేవాడు. ఆయన కంటే కూడా, అతని మోటారు సైకిలంటేనే నాకెందుకో ఎక్కువ ఇష్టం,  ఎప్పుడు చూసినా కొత్తదానిలా మెరుస్తూ , అచ్చం ఆయనలా  నవ్వుతున్నట్టే ఉండేది . బహుశా  అందుకేనేమో !


కొన్ని రోజులకి ఆయన తన సొంతఊరెళ్ళి పోయాడు. వెళ్తూ వెళ్తూ ఈ మోటారు సైకిలుని కూడా తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ మరళా ఇక్కడికి వచ్చేద్దాంలే అన్న ఆలోచన ఆయనకి రాగానే , ఆ మోటారు సైకిలుని ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ళు గడిచాయి, అందమైన అతని మోటారు సైకిలు కాస్తా క్రమంగా కళతప్పటంమొదలు  పెట్టింది .
దాదాపుగా ఏడాది కావొచ్చింది . ఆయేటి ఎండల్ని చూసింది, తర్వాత వానల్ని, ఆతర్వాత మంచుని కూడా.
వీటికి  తోడు ఆ ఇంటి చుట్టుపక్కల పిల్లలు కొట్టిన ఎన్నో బంతి దెబ్బల్ని కూడా తట్టుకుంది. కొందరు ఆకతాయిలు  బలవంతగా గీకడంతో రంగు కూడా చాలా మట్టుకుపోయింది. అసలిప్పుడు ఆ మోటారు సైకిలు ఎలా తయారయ్యింది అంటే, -- ఆమిలటరీ ఆయనే వచ్చి దాన్ని చూసినా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
అచ్చం నేటి మన ప్రాచీనతెలుగు సాహిత్యంలా.

కాలం మారింది., ఎందరో కవులు మారారు , కలాలు మారాయి. పద్య భాష, కావ్య భాష,గద్యభాష,వాడుక భాష .. ఇలా భాషకూడా రూపాంతరం చెందుతూ, మారుతూ, కాలంతో  పోటీ పడుతూ తన ఉనికిని ఎలాగోలా నిలుపుకుంటూ నెగ్గుకొస్తూనే ఉంది.అలా నెగ్గేపంతం లో కొద్దికొద్దిగా తన అస్తిత్వాన్ని, అమరత్వాన్నీ  కోల్పోతూఉంది. 


కృష్ణపక్షాన్ని రాసిన కృష్ణశాస్త్రే ఈకాలం లో మళ్ళీ పుట్టి,
ఇప్పటి చదువులు చదువుకుని , అతను రాసిన కవితల్ని  అతను చదివితే ..
ఆంధ్రభారతి లాంటి తెలుగు నిఘంటువో , మరొకటో లేకపోతే  అతని కవితలో కొన్నింటి అర్ధాలు  అతనికే అర్ధమయ్యే దాఖలా మచ్చుకైనా కనిపించదు.
 

మార్కులకోసం మాతృభాషని వదిలి, ద్వితీయభాషగా సంస్కృతాన్నో, హిందీనో  అందలాన్ని ఎక్కిస్తున్న మీరు?,
భాషని  వదిలిపెట్టేసినా, కనీసం మీ పేరులో అక్షరదోషం ఉన్నా గుర్తించలేని స్థితిలో ఉన్న మీరు?, మీరా ? తెలుగు వెలుగులగురించి, తెలుగు మనుగడ గురించీ మాట్లాడేది అని మీరడగరనుకుంటా !      

  

నేను  తెలుగు చచ్చిపోతుంది, తెలుగుని బతికించండి , అని బతిమాలటానికో,  బావురమనడానికో ఈ బ్లాగుని వేదిక చేసుకోవట్లేదు. ఎందుకంటే, మన ఆలోచన తెలుగు, మన మాట తెలుగు, మన భాష తెలుగు.

మనం ఉన్నంతవరకూ తెలుగు ఉంటూనే ఉంటుంది. అప్పటి వరకూ మన తెలుగుకి వచ్చిన కష్టంగానీ నష్టంగానీ ఏమీ లేవు.  ఇది మనందరికీ తెలుసు. అసలిక్కడ  తెలుగు ఉనికిని గురించిగానీ, తెలుగు ఉన్నతిని గురించిగానీ ప్రశ్నేలేదు. కానీ మనం పరాయి భాషనుంచి పదాలని అప్పుతెచ్చుకోకుండా ఎంత సేపు మనం మన అమ్మ(భాష)తెలుగులో మాట్లాడగల్గుతున్నాం అనేది, మన భాషలో ఉన్న పదాలకి అర్ధాలు మనకెంత వరకూ తెలుసు అనేదే ఇక్కడి ప్రశ్న.          


ఇంతకూ  నేను చెప్పొచ్చేదేమిటంటే
ఈ బ్లాగు మొదలుపెట్టింది పేరుకోసమో, పోస్టుల కోసమో , బ్లాగు క్లిక్కుల కోసమో , కిక్కు కోసమో కాదు.
తరాల తరబడి తరలివస్తున్న తేటతెలుగు తరగల్ని భావితరానికి కలుషితంకాకుండా ప్రవహింపచెయ్యటానికి.

నాకు  నచ్చిన కావ్యంలో  కొన్ని కవితలు, నాకు అర్ధమైన విధానం ఇక్కడ రాస్తాను. ( పదోతరగతిలో మార్కులకోసం రాసిన ప్రతిపదార్ధసందర్భసహిత భావంలా ? .. ఏమో ! ). నాకిక్కడ ఫస్ట్ మార్కులు అవసరంలేదు, పాస్ మార్కులు చాలు.   భావకవిత్వాన్ని , అర్ధవంతంగా చదవాలనుకుంటున్నాను. సహకరించండి.
తప్పులుంటే మన్నించండి ..ఒప్పులుగా సరిదిద్దండి ..